స్కూల్ యూనిఫాం వేసుకుని వచ్చిన ప్రధానోపాధ్యాయుడు.. ఆశ్చర్యపోయిన విద్యార్థులు

11-01-2020 Sat 12:46
  • మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులగూడెంలో ఆదర్శ ప్రధానోపాధ్యాయుడు
  • బుధ, శనివారం మినహా మిగతా అన్ని రోజుల్లోనూ యూనిఫాంలోనే
  • విద్యార్థుల పక్కనే కూర్చొని మధ్యాహ్న భోజనం 

విద్యార్థులు స్కూల్ యూనిఫాంను వేసుకుని బడికి రావడాన్ని ప్రతి రోజు అందరం చూస్తూనే ఉంటాం. ప్రధానోపాధ్యాయుడు స్కూల్ యూనిఫాంను వేసుకుని వస్తే ఎలా ఉంటుంది? మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం నర్సింహులగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇదే జరిగింది.

ఆయన స్కూలు యూనిఫాంతో బడికి రావడంతో విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూశారు. తాను కూడా యూనిఫాం దుస్తులను కుట్టించుకున్నానని ఆయన చెప్పగానే విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఈ యూనిఫాం ధరించింది కేవలం ఒక్కరోజు సరదాకి కాదు. బుధ, శనివారం మినహా మిగతా అన్ని రోజుల్లోనూ యూనిఫాం వేసుకునే వస్తానని ప్రధానోపాధ్యాయుడు కొడిపాక రమేశ్‌ చెప్పి మరింత ఆశ్చర్యానికి గురి చేశారు.  

విద్యార్థుల్లో విద్యార్థిగా కలసిపోయి స్నేహితుడిలా మారి వారికి పాఠాలు చెబుతానంటున్నారు. విద్యాబుద్ధులు నేర్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రమేశ్‌ చెప్పారు. విద్యార్థుల పక్కనే కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు.