రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు.. డ్రోన్ల సాయంతో పహారా

11-01-2020 Sat 11:27
  • ధర్నాలు, నిరసనలు చేపట్టవద్దని పోలీసుల సూచన
  • టెంట్లు వేసేందుకు యత్నించిన రైతులను అడ్డుకున్న వైనం
  • ఎండలోనే నిరసనలు చేపట్టిన రైతులు

అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదని కవాతు నిర్వహించి, మైకుల ద్వారా సూచించారు.

వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో టెంట్లు వేసేందుకు రైతులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, ఎండలోనే కూర్చుని రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. తుళ్లూరులో ఓ ప్రైవేటు స్థలంలో రైతులు కూర్చోగా... పోలీసులు అక్కడకు కూడా వచ్చారు. దీంతో, గేటుకు రైతులు తాళం వేశారు. ఈ నేపథ్యంలో, ఆ ప్రైవేటు స్థలంపై పోలీసులు డ్రోన్ ద్వారా నిఘా పెట్టారు.