బస్సులో అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యాడు!

11-01-2020 Sat 10:16
  • మహిళ పట్ల తోటి ప్రయాణికుడి తలతిక్క వేషాలు 
  • వందకు ఫోన్ చేసిన బాధితురాలు 
  • పశ్చిమబెంగాల్ వాసిని అరెస్టు చేసిన పోలీసులు

బస్సులో పక్కన కూర్చున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పశ్చిమబెంగాల్ యువకుడు అడ్డంగా బుక్కయిపోయాడు. సదరు మహిళ గుట్టుచప్పుడు కాకుండా 100 నెంబర్ కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో గురుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఓ మహిళ టికెట్ బుక్ చేసుకుంది. ఇదే బస్సులో పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ యువకుడు ఆమె పక్క సీటులో కూర్చుని ప్రయాణిస్తున్నాడు. ప్రయాణం ప్రారంభించాక సదరు యువకుడు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. వారించినా వినకపోవడంతో ఆమె వంద నంబర్ కు డయిల్ చేసి ఫిర్యాదు చేసింది.

దీంతో బస్సు అనంతపురం జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడికొండ చెక్ పోస్టు వద్దకు వచ్చేసరికి పోలీసులు ప్రత్యక్షమయ్యారు. బస్సును నిలువరించి బాధితురాలి ఫిర్యాదు మేరకు చిలమత్తూరు పోలీసులు జీరో ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. అనంతరం నిందితుడైన యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.