మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి కేసు.. నలుగురు నిందితుల అరెస్ట్

11-01-2020 Sat 07:01
  • ఈ నెల 7న జాతీయ రహదారిపై రైతుల ఆందోళన
  • అటువైపు వచ్చిన ఎమ్మెల్యే కారును అడ్డుకుని రాళ్లదాడి
  • నిందితులకు రిమాండ్ విధించిన కోర్టు

ఈ నెల 7న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కారుపై దాడి చేసిన వారిని గుర్తించారు. తాజాగా వారిని అరెస్ట్ చేశారు.

 అరెస్ట్ అయిన వారిలో పిడుగురాళ్లకు చెందిన ఇంతియాజ్‌, వినుకొండకు చెందిన సాయి, దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన పి.సత్యనారాయణ, మంగళగిరి మండలం చినకాకానికి చెందిన కఠారి ప్రసాద్‌ ఉన్నట్టు గుంటూరు రూరల్ సీఐ శేషగిరిరావు తెలిపారు. కోర్టు వీరికి రిమాండ్ విధించినట్టు చెప్పారు.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఈ నెల 7న రాజధాని రైతులు చినకాకాని జాతీయ రహదారిని దిగ్బంధించి ఆందోళనకు దిగారు. అదే సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారులో అటువైపు నుంచి వెళ్తుండగా అడ్డుకున్న రైతులు దాడికి దిగారు. కారుపై రాళ్లదాడికి దిగారు.