ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-బస్సు ఢీ.. 20 మంది సజీవ దహనం

11-01-2020 Sat 06:46
  • పేలిన డీజిల్ ట్యాంకు.. చెలరేగిన మంటలు
  • మంటల్లో చిక్కుకుని విలవిల్లాడిన ప్రయాణికులు
  • మరో 21 మందికి తీవ్ర గాయాలు

ఉత్తరప్రదేశ్‌లో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫరూఖాబాద్ నుంచి 45 మంది ప్రయాణికులతో జైపూర్ వెళ్తున్న ఏసీ బస్సు చిలోయి వద్ద ట్రక్కును బలంగా ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అవి బస్సు మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులు తప్పించుకునే వీలు లేకుండాపోయింది.

స్థానికులు, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 21 మంది ప్రయాణికులను కాపాడారు. అయితే, అప్పటికే మంటల్లో చిక్కుకున్న మరో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డీజిల్ ట్యాంకు పగలడం వల్లే మంటలు చెలరేగాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద విషయం తెలిసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.