లంకను గెలిచిన టీమిండియా... సిరీస్ మనదే!

10-01-2020 Fri 22:17
  • మూడో టీ20లో భారత్ జయభేరి
  • పుణే పోరులో 78 పరుగుల తేడాతో లంక ఓటమి
  • 2-0 తో సిరీస్ టీమిండియా కైవసం

మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ లో భారత్ 78 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. పుణేలో 202 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక 15.5 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్ లో ధనంజయ డిసిల్వా (57), ఏంజెలో మాథ్యూస్ (31) మినహా మరెవ్వరూ రాణించలేదు. మిగతా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.

భారత బౌలర్లలో నవదీప్ సైనీకి 3 వికెట్లు దక్కగా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఈ విజయంతో భారత్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక భారత్ తన తదుపరి సిరీస్ ను కూడా సొంతగడ్డపైనే జనవరి 14 నుంచి ఆడనుంది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల సిరీస్ లో ఆడనున్నాయి.