దీపిక ‘తుక్డే తుక్డే గ్యాంగ్’ వైపు నిలబడింది: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

10-01-2020 Fri 18:33
  • అది దేశాన్ని విచ్ఛిన్నం చేసే సమూహం అని ఆమెకు తెలుసు
  • ఆమె హక్కును, స్వేచ్ఛను ప్రశ్నించడం లేదు
  • 2011లోనే దీపిక కాంగ్రెస్ కు మద్దతు తెలిపింది

ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీని (జేఎన్ యూ) బాలీవుడ్ నటి దీపిక పదుకొనే సందర్శించి నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సంఘీభావం తెలపడంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని మండిపడ్డారు. ఇటీవల దుండగులు జేఎన్ యూలోకి ప్రవేశించి విద్యార్థులపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. దాడులకు పాల్పడింది ఏబీవీపీ, ఆరెస్సెస్ యువ విభాగమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. దీపిక యూనివర్సిటీని సందర్శించడంతో మంత్రి ఆమెపై తీవ్ర వాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. బాధ్యతగల మంత్రిగా ఉండి ముందస్తుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయనని మంత్రి చెప్పారు.  

దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని భావిస్తున్న వారికి దీపిక మద్దతు తెలుపుతోందని ఆరోపించారు. దుండగుల దాడిలో గాయపడ్డ జేఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే  ఘోష్ తో పాటు మరికొందరు విద్యార్థులను దీపిక పరామర్శించారు. నల్లని దుస్తుల్లో వచ్చిన దీపిక విద్యార్థుల నిరసనకు సంఘీభావం తెలిపారు. తాను ఎవరి వెనక నిలబడ్డానన్న విషయం దీపికకు తెలుసని మంత్రి పేర్కొన్నారు.

చెన్నైలో స్మృతి ఇరానీ ఓ కార్యక్రమంలో మాట్లాడాతూ.. ‘దీపికకు తాను ఎవరివైపు ఉండాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఉంది కానీ.. అమె దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే సమూహం వైపు ఉంది. ఆమె ఎంచుకున్న రాజకీయపక్షాన్నికానీ, స్వేచ్ఛను కానీ నేను ప్రశ్నించడం లేదు. దీపిక 2011లోనే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. దీనిపై చాలామంది ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే వారికి ఆనాటి విషయం తెలియదు’ అని స్మృతి ఇరానీ అన్నారు.

మరోవైపు తాను నటించిన చిత్రం ఛపాక్ ప్రమోషన్ కోసం దీపిక ఈ విధంగా చేసిందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఛపాక్ చిత్రం ఆసిడ్ బాధితురాలి కథ నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రంలో దీపిక ఓ ఆసిడ్ బాధితురాలిగా నటించారు.