నేను అన్ని రకాల పాత్రలు చేయకుండా ఉండాల్సింది: నటుడు శివారెడ్డి

10-01-2020 Fri 14:53
  • నాకు మిమిక్రీ అంటేనే ఇష్టం 
  • ఏదో ఒక రూట్లో వెళితే బాగుండేది 
  • మిమిక్రీ మానేయకపోవడం కూడా కారణమేనన్న శివారెడ్డి

మిమిక్రీ శివారెడ్డిని గురించి తెలియనివారుండరు. ఒక వైపున సినిమాలు చేస్తూనే మరో వైపున స్టేజ్ షోలు చేస్తూ ఆయన అందరినీ నవ్వించేస్తుంటాడు. అలాంటి శివారెడ్డి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .."నాకు గుర్తింపు తెచ్చింది మిమిక్రీనే.  మిమిక్రీ ద్వారానే నాకు సినిమాల్లోను అవకాశం వచ్చింది. నా మొదటి సినిమా 'పిట్టలదొర. ఆ తరువాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లాను.

శివారెడ్డి ఫలానా పాత్రలు మాత్రమే బాగా చేయగలడు అని అనుకోకూడదనే ఉద్దేశంతో, అన్ని రకాల పాత్రలు చేశాను. అయితే అలా చేయడం నేను చేసిన తప్పు అనే విషయం ఆ తరువాత అర్థమైంది. ఒక తరహా పాత్రలు చేస్తూ పేరు తెచ్చుకుంటే, ఆ తరహా పాత్రల కోసం పిలిచేవారు. అన్ని రకాల పాత్రలు చేయడం వలన, నన్ను ఏ తరహా పాత్రలకి పిలవాలనే విషయంలో అయోమయానికి అవతలివారు లోనయ్యారని అనుకుంటున్నాను. నేను మిమిక్రీ మానేయకపోవడం కూడా సినిమాల్లో అవకాశాలు తగ్గడానికి మరో కారణమనే విషయం కూడా నాకు అనుభవంలోకి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.