రెండోసారి హైపవర్ కమిటీ భేటీ.. వివరాలు తెలిపిన మంత్రి పేర్ని నాని

10-01-2020 Fri 16:57
  • రాజధాని రైతుల ప్రయోజనాలకు పెద్ద పీట 
  • కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రతిపాదనలు 
  • రైతులు, ఉద్యోగులు సహా అందరి అభిప్రాయం తీసుకుంటాం  

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని, అభివృద్ధిపై నియమించిన కమిటీలు ఇచ్చిన నివేదికల పరిశీలనకోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఈ రోజు మరోసారి భేటీ అయింది. ఈ సమావేశంలో చర్చించిన వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీలతోపాటు శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికల్లోని అంశాలు, సిఫారసులపై  తాజా భేటీలో క్షుణ్ణంగా చర్చించామని మంత్రి తెలిపారు.

పాలన వికేంద్రీకరణతో పాటు, అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాల పరిరక్షణపై చర్చించామన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రతిపాదనలు సమావేశంలో చర్చకు వచ్చాయన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు సమానంగా, సమాంతరంగా అభివృద్ధి జరగాలన్న నేపథ్యంలో కమిటీ చర్చిందని తెలిపారు. రైతులు, ఉద్యోగులతోపాటు, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ నెల 13న మరోసారి కమిటీ సమావేశమవుతుందని నాని చెప్పారు.