మాజీ మంత్రి నారాయణ గారూ, అప్రూవర్ గా మారిపోండి.. మీకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది: వైసీపీ నేత అమర్ నాథ్

09-01-2020 Thu 22:04
  • అసలు, నారాయణ ఏమైపోయారు?
  • 22 రోజులుగా బయటకొచ్చి మాట్లాడలేదు
  • ఏదో రహస్యం ఉంది?

రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమం కేవలం 29 గ్రామాలకు సంబంధించిందేనని, చంద్రబాబు చెబుతున్నట్టుగా ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించింది కాదని అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని తరలిస్తున్నారంటూ చేస్తున్న ఉద్యమం పదమూడు జిల్లాల ప్రజలకు సంబంధించింది కాదు, తెలుగు జాతికి సంబంధించిన సమస్య కాదు, కేవలం, చంద్రబాబుకు చెందిన పెట్టుబడిదారులు, ఆయన బినామీలు చేస్తున్న ఉద్యమం ఇదని ఆరోపించారు.

ఈ సందర్భంగా టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ గురించి ఆయన ప్రస్తావించారు. ‘అసలు, నారాయణగారు ఏమైపోయారు? ఈ రాజధాని రూపకల్పన కమిటీకి ఆయన చైర్మన్. నారాయణ ఎక్కడ దాక్కున్నారు? కనబడట్లేదు. నారాయణను మీరేమి చేశారు? నారాయణ బయటకొచ్చి ఏదైనా మాట్లాడితే ముప్పు అని చెప్పి కొంపదీసి ఏదైనా చేశారా? దయచేసి, తెలుగుదేశం పార్టీ వాళ్లందరూ నారాయణను బయటకు తీసుకురావాలని కోరుతున్నా. నారాయణ బయటకొచ్చి మాట్లాడాలని కోరుతున్నాను.

సీఆర్డీఏ పరిధిలో ఏ రకమైన కార్యక్రమాలు చేశారు? ఐదు సంవత్సరాలు మంత్రిగా, సీఆర్డీఏ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించారు. ఇరవై రెండు రోజులుగా చూస్తున్నా నారాయణ బయటకొచ్చి ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదంటే ఏదో రహస్యం ఉంది. నారాయణ గారిని జాగ్రత్తగా ఉండమని కోరుతున్నా. మీ సెక్యూరిటీని జాగ్రత్తగా చూసుకోండి. మీ మధ్యలో నుంచే ముప్పు వచ్చే అవకాశం ఉంది గమనించండి.

‘తప్పు ఏదో జరిగిపోయింది.. చేయమన్నాడు కాబట్టి చేశాను, నాకు ఏ పాపం పుణ్యం తలియదు’ అని చెప్పి మీరు అప్రూవర్ గా మారిపోయి ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి.. మీకు కావాల్సిన రక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అన్నారు. లేనిపక్షంలో దేశాలు దాటి వెళ్లిపోవాలని, లేకపోతే నారాయణకు ముప్పు ఉంటుందన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని అమర్ నాథ్ అన్నారు.