ఈ పృథ్వీలాంటి వాళ్ల వల్లే ఆడవాళ్లు 'జగన్ మోహన్ రెడ్డి గాడు' అని తిడుతున్నారు: పోసాని

09-01-2020 Thu 21:26
  • రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న పృథ్వీ
  • తీవ్రంగా స్పందించిన పోసాని
  • రాజధాని ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఏ విషయంపై అయినా ధాటిగా మాట్లాడే సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ పై విరుచుకుపడ్డారు. అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులను పృథ్వీ పెయిడ్ ఆర్టిస్టులని పేర్కొనడాన్ని పోసాని తప్పుబట్టారు. ఏటా మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం ఇచ్చేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులని వ్యాఖ్యానించినందుకు పృథ్వీ సిగ్గుపడాలని అన్నారు. పృథ్వీలాంటి వాళ్ల కారణంగానే రాష్ట్రంలోని ఆడవాళ్లు జగన్ మోహన్ రెడ్డి గాడు అని తిడుతున్నారని తెలిపారు.

సీఎం జగన్ ను అప్రదిష్ఠ పాలుచేసేందుకే పృథ్వీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని విమర్శించారు. అమరావతి ఆడపడుచులకు పృథ్వీ క్షమాపణ చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. వైసీపీలో తాను కూడా ఉన్నానని, తనతో పాటు రోజా కూడా పదేళ్లుగా పార్టీలోనే ఉన్నారని, తాము ఎప్పుడూ ఇలా మాట్లాడలేదని అన్నారు. కానీ, పృథ్వీలాంటి వాళ్లు ఈ మూడ్నాలుగేళ్లలో వచ్చి చేరారని విమర్శించారు.