2014 డిసెంబర్ 31కి ముందు వచ్చిన వారికే భారత పౌరసత్వం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

09-01-2020 Thu 17:38
  • సీఏఏ లో ఒక్క తప్పున్నా మార్చుతాం
  • ఇది ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదు
  • ఐదేళ్లలో మోదీ అద్భుత పాలన అందించారు

భారత్ లోకి వచ్చిన శరణార్థులను ఆదుకోవడానికి పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) తీసుకొచ్చామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఈ పౌరసత్వ సవరణ చట్టంలో ఒక్క అక్షరం తప్పున్నా మార్చడానికి సిద్ధమని చెప్పారు. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్ లోకి వచ్చిన వారికే పౌరసత్వం కల్పిస్తామని తెలిపారు.

ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ పారదర్శకమైన, నీతివంతమైన పాలన అందించారన్నారు. ఈ చట్టాన్ని అన్ని రకాలుగా ఆలోచించే తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. ఏ ఒక్క కులం, మతం, వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించలేదని స్పష్టం చేశారు. సీఏఏపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.