Jagan: జగన్ చరిత్రకారుడు, చంద్రబాబు చరిత్రహీనుడు: 'అమ్మ ఒడి' ప్రారంభోత్సవంలో రోజా వ్యాఖ్యలు

  • అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
  • సీఎంను ఆకాశానికెత్తేసిన రోజా
  • చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

బిడ్డలను చదివించే తల్లులకు ఆసరాగా ఏపీ ప్రభుత్వం 'అమ్మ ఒడి' పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. చిత్తూరులో సీఎం జగన్ 'అమ్మ ఒడి' పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన నగరి ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబుల మధ్య ఎంతో తేడా ఉందని అన్నారు. పేద కుటుంబాల పిల్లల కోసం 'అమ్మ ఒడి' పథకాన్ని తీసుకువచ్చిన జగన్ చరిత్రకారుడని, గవర్నమెంట్ స్కూళ్లలో పేదల చదువును కార్పొరేట్ పాఠశాలలు, కార్పొరేట్ కళాశాలలకు బలిచేసిన చరిత్రహీనుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. కనీసం తను చదివిన స్కూలును కూడా అభివృద్ధి చేయలేని అసమర్థ చరిత్రహీనుడు అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారంతో కూడిన మెనూను రూపొందించిన సీఎం  జగన్ చరిత్రకారుడు అయితే, పేదలు తినాల్సిన కోడిగుడ్లను మింగిన చరిత్రహీనుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తున్న చరిత్రకారుడు జగన్ అని, ఫీజు రీయింబర్స్ మెంట్ ను రూ.35 వేలకు కుదించిన చంద్రబాబు చరిత్రహీనుడు అని వివరించారు.

More Telugu News