Venkaiah Naidu: ఈ 3బీ ఫార్ములాకు ప్రజలు దూరంగా ఉండాలి: వెంకయ్యనాయుడు

  • 'రాజకీయాల్లో ధన ప్రభావం' అంశంపై హైదరాబాదులో సదస్సు
  • ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ వర్శిటీ, ఐఎస్ బీ
  • ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు
  • బీరు, బిర్యానీ, బస్సు ఫార్ములా గురించి వివరణ

'రాజకీయాల్లో ధన ప్రభావం' అనే అంశంపై హైదరాబాద్ విశ్వవిద్యాలయం, ఐఎస్ బీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడం సాధారణ విషయంలా మారిందని,  జనాన్ని తరలించేందుకు ఓ బస్సు, వారిని ఆకర్షించేందుకు బీరు, బిర్యానీ పరిపాటిగా మారాయని అన్నారు. ఈ 3బీ (బీరు, బిర్యానీ, బస్సు) ఫార్ములాకు ప్రజలు దూరంగా ఉండాలని, అప్పుడే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమవుతుందని అభిలషించారు.

దేశంలో ఎన్నికలు జరుగుతున్న విధానం సరిగాలేదని, మార్పులు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. "దేశంలో ఎక్కడో ఒక చోట ఆర్నెల్ల వ్యవధిలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో ఝార్ఖండ్ రాష్ట్రం సిద్ధమైంది. ఆ తర్వాత ఢిల్లీ...! ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలు జరపడం వల్ల బీరు, బిర్యానీ, బస్సు ఫార్ములా వాడకం పెరిగిపోయింది.

ఇలా కాకుండా పంచాయతీ ఎన్నికల నుంచి, మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వరకు ఒకే వారంలో దేశం మొత్తం నిర్వహించాలి. ఈ విధంగా ఐదేళ్లకోసారి సమగ్ర ఎన్నికలు జరిగితే పార్టీల పూర్తి అజెండా, మేనిఫెస్టోలపై ప్రజల్లో అవగాహన ఏర్పడుతుంది" అని ఉపయుక్తకరమైన సూచనలు చేశారు.

More Telugu News