పెళ్లి చేసుకోగానే పిల్లలు కావాలనుకోలేదు: బాలీవుడ్ నటి కాజోల్

09-01-2020 Thu 14:32
  • హనీమూన్ తర్వాత కొంతకాలానికి పిల్లలను కోరుకున్నాం
  • 2001లో తొలిసారిగా గర్భం దాల్చాను.. నిలువలేదు
  • అనంతరం మరోసారి గర్భస్రావం జరిగింది

ప్రముఖ బాలీవుడ్ తారల జోడీ అజయ్ దేవగణ్, కాజోల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం తనకు రెండు సార్లు గర్భస్రావమైందని కాజోల్ సామాజిక మీడియా మాధ్యమంగా తెలిపి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది.

తన భర్త అజయ్ దేవగణ్ తో కలిసి నటించిన ‘తానాజీ’ చిత్రం రేపు విడుదల కానున్న నేపథ్యంలో కాజోల్ తన జీవితంలో చోటుచేసుకున్న బాధాకరమైన ఘటనలను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు. ఇరవై ఐదేళ్ల క్రితం ‘హల్ చల్’ సినిమా సెట్లో తాము కలిశామని, అప్పుడే తమలో ప్రేమ చిగురించిందని అన్నారు. నాలుగేళ్లపాటు డేటింగ్ అనంతరం పెళ్లి, విదేశాల్లో హనీమూన్ విశేషాలను ఆమె వెల్లడించారు.  

‘హీరో అజయ్ దేవగణ్ తో వివాహమైన తర్వాత సిడ్నీ, హవాయి, లాస్ ఏంజెల్స్ ప్రాంతాలకు హనీమూన్ కు వెళ్లాం. కొంత కాలం తర్వాత పిల్లలు కావాలనుకున్నాం. 2001లో ‘కభీ ఖుషీ కభీ ఘం’ సినిమా షూటింగ్ సమయంలో గర్భం దాల్చాను. అ సినిమా బాగా ఆడింది. అలాంటి ఆనందకరమైన సమయంలో నాకు గర్భస్రావం కావడంతో ఆసుపత్రిలో చేరాను. తర్వాత కూడా మరోసారి గర్భస్రావం జరిగింది. అనంతరం మాకు నైసా, యుగ్ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు’ అని ట్వీట్ చేశారు.