అర్ధరాత్రి చంద్రబాబు ఇంటి వద్ద వంగవీటి రాధా ప్రత్యక్షం.. షాకైన టీడీపీ శ్రేణులు!

09-01-2020 Thu 11:02
  • ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి 
  • ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరం 
  • రాధా రాకతో పార్టీ వర్గాల్లో చర్చ

ఎన్నికల తర్వాత రాజకీయాలతోనే తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వంగవీటి రాధా నిన్న అర్ధరాత్రి ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటివద్ద హఠాత్తుగా ప్రత్యక్షమై పార్టీ శ్రేణులకు షాకిచ్చారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్ర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. బాబు అరెస్టు సమాచారం తెలుసుకున్న రాధా ఆయన ఇంటికి వెళ్లారు. లోకేశ్ తోపాటు ఇతర నేతలను కలుసుకున్నారు.

అయితే రాధా రాక మాత్రం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ నుంచి రాధా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అభ్యర్థుల కోసం కష్టపడ్డారు. రాష్ట్రంలో పార్టీ అధికారం పోగొట్టుకోవడంతో కంగుతిన్న రాధా ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అమరావతి కేంద్రంగా ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా ఆయన పాల్గొన్న దాఖలాల్లేవు. రాధా పూర్తిగా రాజకీయాలను వదిలేశారా అన్నట్లు ఆయన వ్యవహారశైలి కొనసాగింది.

ఈ కారణంగానే చంద్రబాబు ఇంట్లో హఠాత్తుగా రాధా ప్రత్యక్షమవ్వడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరిచింది. కాసేపు అన్ని విషయాలు పక్కన పెట్టి రాధా రాకపైనే పలు కోణాల్లో మాట్లాడుకోవడం కనిపించింది. మళ్లీ ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నారని భావిస్తున్నారు. కాగా, బాబు ఇంటికి వచ్చిన రాధా చంద్రబాబును కలవలేకపోయారు. దీంతో లోకేశ్, ఇతర నాయకులతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు.