విశాఖ మిలీనియం టవర్ లో సచివాలయం?.. భవనాన్ని పరిశీలించిన ఏపీఐఐసీ ఎండీ!

09-01-2020 Thu 10:08
  • టవర్ బి పనులు ఎప్పటికి పూర్తవుతాయని ఆరా 
  • మరికొన్ని భవనాల్లోని అనుకూలతల పైనా వివరాల సేకరణ 
  • ఐటీ హిల్స్ లోని హెల్త్ సర్వీసెస్ భవనం పరిశీలన

ఓ వైపు అమరావతిలో రైతుల ఉద్యమం, మరోవైపు విశాఖలో సచివాలయం ఏర్పాటుకు అవసరమైన వసతి సదుపాయం కోసం అధికారుల వెతుకులాట ఏకకాలంలో కొనసాగుతున్నాయి. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయొచ్చంటూ వినిపిస్తున్న వార్తలకు తగ్గట్టుగా అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీఐఐసీ ఎండీ రజత్ భార్గవ విశాఖ విచ్చేసి ఇక్కడి ఐటీ క్యారిడార్ లోని పలు భవనాలను పరిశీలించారు.

ఇప్పటికే పలు దఫాలుగా అమరావతి నుంచి ఉన్నతాధికారులు వచ్చి నగరంలోని పలు భవనాల్లో అనుకూలతలపై ఆరాతీస్తున్నారు. ఈ నేపథ్యంలో రజత్ పర్యటన మరింత ఆసక్తి రేకెత్తించింది. తొలుత రజత్ భార్గవ మిలీనియమ్ టవర్‌ను పరిశీలించారు.

అనంతరం దాని వెనుక నిర్మాణంలో ఉన్న టవర్-బిని సందర్శించారు. పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయని ఆరాతీశారు. ఈ సందర్భంగా నగరంలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులు రజత్ భార్గవను మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు అంశాలు వివరించారు.

మరోవైపు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు ఐటీ హిల్స్ లోని కనకదుర్గా హెల్త్ సర్వీసెస్ సంస్థ భవనాన్ని పరిశీలించారు. దాదాపు 1.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భవనం ప్రభుత్వ అవసరాలకు ఎంతవరకు సరిపోతుందో చర్చించారు.

అనంతరం భవన యజమాని సాంబశివరావుతో మాట్లాడి భవనం మొత్తాన్ని తమకు అద్దెకు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.