వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్!

09-01-2020 Thu 09:56
  • పిన్నెల్లిపై అమరావతిలో దాడి
  • మొత్తం 50 మంది వరకూ ఉన్నారన్న పోలీసులు
  • ఐదు బృందాలతో నిందితుల కోసం గాలింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అమరావతిలో జరిగిన దాడిపై హత్యాయత్నం అభియోగాలతో కేసును నమోదు చేసిన పోలీసులు, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఈ ఇద్దరిపైనా ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు పెట్టినట్టు గుంటూరు పట్టణ పోలీసులు వెల్లడించారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని అన్నారు.

 కాగా,  అరెస్టు చేసిన ఇద్దరిలో ఒకరు తాడికొండకు చెందిన టీడీపీ నేత కొమ్మినేని రాము కాగా, మరొకరు చినకాకానికి చెందిన లారీ డ్రైవర్‌ సోమవరపు ప్రకాశ్‌ అని వెల్లడించారు. దాదాపు 20 నుంచి 50 మంది వరకూ పిన్నెల్లిపై దాడికి దిగారని, వీరంతా ఒక ప్రాంతానికి చెందిన వారు కాదని ప్రాథమికంగా గుర్తించామని అన్నారు. పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా, నిరసనలకు దిగారన్న అభియోగాలపైనా కేసు నమోదు చేశామన్నారు.