Nirbhaya: ఇటువంటి ఏడుపులు చాలానే చూశాను... నేనిప్పుడు రాయిగా మారాను: నిర్భయ తల్లి

  • శిక్షను తప్పించుకునేందుకు దోషులకు ఆస్కారమివ్వను
  • తన కుమార్తెపై జంతువుల్లా ప్రవర్తించిన వారిపై జాలి లేదు
  • వారికి శిక్షతో కామాంధులకు హెచ్చరికలు వెళతాయన్న నిర్భయ తల్లి

నిర్భయ దోషులకు మరణదండన పడిన ఏడు సంవత్సరాల తరువాత నలుగురిపై డెత్ వారెంట్ జారీ అయిన వేళ, తన బిడ్డ బతికేందుకు సహకరించాలని ఓ దోషి తల్లి కన్నీటితో చేసిన విజ్ఞప్తిపై నిర్భయ తల్లి స్పందించింది. "నేను ఎన్నో ఏళ్లుగా ఏడుస్తూనే ఉన్నాను. నా కళ్ల వెంట రక్తపు కన్నీరే కారింది. నా గుండె ఇప్పుడు రాయిగా మారింది" అని వ్యాఖ్యానించారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని తాను ఎలా మరచిపోగలనని ప్రశ్నించారు.

తాజాగా ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన ఆమె, కేసులో దోషిగా ఉన్న ముఖేశ్ సింగ్ తల్లి చేసిన అభ్యర్థనపై స్పందించారు. ఆ సమయంలో ఆమెలో ఎటువంటి భావోద్వేగాలూ లేవు. తన కుమార్తె శరీరాన్ని రక్తంలో ముంచేశారని, ఆమె శరీరంపై ఎన్ని గాయాలు ఉన్నాయో అందరికీ తెలుసునని అన్నారు. జంతువుల్లా ఆమెపై దాడి చేశారని, ఇప్పుడు వీరి ఏడుపులు, శిక్షను తప్పించుకునేందుకు చేస్తున్న విజ్ఞప్తులు తనను మార్చలేవని అన్నారు. వారిపై ఇప్పుడు తనకు ఎటువంటి దయ, జాలి లేవని అన్నారు.

తన కుమార్తెను తాను అత్యంత దయనీయ స్థితిలో చూశానని చెప్పిన నిర్భయ తల్లి, అప్పటి నుంచి ఇప్పటి వరకూ  ఏడుస్తూనే ఉన్నానని అన్నారు. జాతి చూసిన ఘటనను ఎవరూ అంత తొందరగా మరచిపోలేరని అన్నారు. తన బాధ జీవితాంతం ఉంటుందని, వారికి ఉరిశిక్ష పడితే, అది జాతికే ఓ మెసేజ్ ని పంపుతుందని, సమాజంలోని కామాంధులకు చట్టం నుంచి తప్పించుకోలేమన్న హెచ్చరికను పంపుతుందని అన్నారు.

కాగా, ఈ నెల 22న ఉదయం 7 గంటల్లోగా వారికి ఉరిశిక్షను అమలు చేసేందుకు తీహార్ జైల్ లోని 3వ నంబర్ సెల్ లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉరితీతకు సంబంధించి నాలుగు సొరంగాలు, నాలుగు ఉరితాళ్లు తయారు చేశారు.

More Telugu News