భారత చరిత్రలో ఇదే అత్యధికం... కారుకు రూ. 27. 68 లక్షల జరిమానా!

09-01-2020 Thu 06:41
  • అహ్మదాబాద్ లో పోర్షే కారులో వస్తున్న యజమాని
  • నంబర్ ప్లేట్ లేకపోవడంతో ఆపేసిన పోలీసులు
  • భారీ జరిమానా విధించిన వైనం

అది ఖరీదైన పోర్షే కారు. కారుకు సంబంధించి ఏ విధమైన పత్రాలూ లేవు. దీంతో ఆ కారుకు పోలీసులు జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఇండియాలో ఓ కారు యజమానికి విధించబడిన అత్యధిక జరిమానా ఇదే. ఇంతకీ.. ఎంత జరిమానా పడిందో తెలుసా? రూ. 27. 68 లక్షలు!

ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది. పోర్షే కారు యజమాని దాన్ని నడుపుకుంటూ రాగా, తనిఖీలు చేస్తున్న పోలీసులు ఆపారు. కారుకు నంబర్ ప్లేట్ లేదు. ఉండాల్సిన ముఖ్యమైన పత్రాలు కూడా లేవు. దీంతో తొలుత రూ. 9. 80 లక్షల ఫైన్ వేసిన అధికారులు, ఆరు వారాల తరువాత దాన్ని సమీక్షించారు. జరిమానాను రూ. 27.68 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపారు.

ఇండియాలో ఇదే అత్యధిక జరిమానా అని అహ్మదాబాద్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. వాహనం నడిపే సమయంలో వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ), ఇన్సూరెన్స్ పేపర్స్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికేట్ తప్పనిసరని అన్నారు.