Donald Trump: మా వద్ద మరింత శక్తిమంతమైన, కచ్చితమైన బాంబులున్నాయి!: ఇరాన్ కు ట్రంప్ కౌంటర్

  • ఇరాన్ ను అణ్వాయుధ దేశం కానివ్వబోను
  • సులేమానీ అత్యంత క్రూరుడే
  • అతని హత్యతో ఉగ్రవాదులకు కఠిన సంకేతాలు
  • జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్

"నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వాయుధ దేశం కాబోదు, ప్రపంచ శాంతినే అమెరికా కోరుకుంటుంది. అన్ని దేశాలతో అమెరికా సత్సంబంధాలకే విలువనిస్తుంది. ఇరాన్ ప్రజలు, ఆ దేశ నాయకులు కోరుకుంటున్న గొప్ప భవిష్యత్తు లభించాలని నేను కోరుకుంటున్నాను" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇరాన్ మిలిటరీ జనరల్ సులేమానీ హత్య తరువాత, యుద్ధమేఘాలు కమ్ముకోగా, ఇరాన్ క్షిపణి దాడులు చేసిన నేపథ్యంలో నిన్న ట్రంప్, జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ ఎలా స్పందిస్తారోనన్న ఉత్కంఠ, మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందన్న ఊహాగానాల మధ్య, ఆయన శాంతి వచనాలు పలికారు. తామేమీ యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెబుతూనే, ఇరాన్ కు చురకలు అంటించారు.

సులేమానీ హత్యను సమర్ధించుకున్న ట్రంప్, అతన్ని ఎన్నడో హతమార్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అతని చేతులు ఇరాన్, అమెరికాల రక్తంతో తడిశాయని, అతని హత్యతో ఉగ్రవాదులకు కఠిన సందేశం వెళ్లిందని అన్నారు. ఇరాన్ క్షిపణి దాడుల్లో తమ సైన్యంలోని ఏ ఒక్కరికీ గాయాలు కాలేదని చెప్పారు. ఇరాన్ వద్ద ఉన్న బాంబులతో పోలిస్తే, మరింత శక్తిమంతమైన, కచ్చితమైన బాంబులు తమ వద్ద ఉన్నాయన్న విషయాన్ని మరువరాదని అన్నారు.

ఇరాన్ పై తక్షణం మరిన్ని ఆంక్షలు విధిస్తున్నామని, ఆ దేశం తన వైఖరిని మార్చుకునేంత వరకూ ఇవి కొనసాగుతాయని స్పష్టం చేసిన ట్రంప్, ఇరాన్ దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నందున ఇరాక్ లోని తమ అన్ని సైనిక స్థావరాల్లోనూ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు.

More Telugu News