చంద్రబాబు సహా జేఏసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు

08-01-2020 Wed 20:06
  • అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయం వద్ద ఉద్రిక్తత
  • బస్సుయాత్ర చేయకుండా అడ్డుకున్న పోలీసులు  
  • రహదారిపైనే చంద్రబాబు, పార్టీల నేతల బైఠాయింపు

విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజకీయ జేఏసీ తలపెట్టిన బస్సుయాత్రను ప్రారంభించకుండా పోలీసులు అడ్డుకున్నారు. అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం నుంచి స్థానిక గురునానక్ కాలనీ వరకు పాదయాత్రగా వెళ్లి బస్సు యాత్రను ప్రారంభించాలని అనుకున్నారు.

అయితే, కేంద్ర కార్యాలయం ప్రధాన గేటును దాటి బయటకు వస్తున్న చంద్రబాబును, జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో వివిధ పార్టీల నేతలు, జేఏసీ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. స్థానిక వేదిక కల్యాణ మంటపం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రహదారిపైనే చంద్రబాబు, పార్టీల నేతలు బైఠాయించారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.