అమరావతినే రాజధానిగా కోరుకుంటా.. జగన్ నిర్ణయమే ఫైనల్!: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌

08-01-2020 Wed 17:38
  • ఈ ప్రాంతం వాడ్ని కాబట్టే అమరావతిని సమర్థిస్తున్నా
  • అభివృద్ధి, సంక్షేమం నా రెండు కళ్లు
  • నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడతా

వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం నియోజకవర్గంనుంచి గెలిచిన కృష్ణ ప్రసాద్ ఈ ప్రాంత వాసిగా తాను రాజధానిగా అమరావతి కొనసాగింపునే కోరుకుంటున్నానన్నారు. అయితే.. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అని, అదే తనకు శిరోధార్యమని చెప్పారు.

నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనంతరం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం తనకు, పార్టీకి రెండు కళ్లు అని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమ తీరును దుయ్యబట్టారు. రాజకీయ నిరుద్యోగి అయిన ఉమాకు అమరావతి ఉద్యమం కోతికి కొబ్బరికాయ దొరికిన చందంగా ఉందన్నారు.