నిర్భయ దోషుల ఉరితీతకు ట్రయల్స్ వేయనున్న జైలు అధికారులు

08-01-2020 Wed 14:00
  • నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ 
  • ఈ నెల 22న అమలుకు సన్నాహాలు
  • మూడో నెంబరు జైల్లో ఏర్పాట్లు

కొన్నేళ్ల క్రితం దేశ రాజధానిలో నిర్భయపై జరిగిన పాశవిక దాడి ఘటన ఇప్పటికీ దేశంలో మానని గాయంలానే ఉంది. ఇన్నాళ్లకు నిర్భయ దోషులకు మరణశిక్ష అమలు జరిగే రోజు ఖరారు కావడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. జనవరి 22న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో తీహార్ జైల్లో సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీహార్ నుంచి ప్రత్యేకమైన ఉరితాళ్లు రాగా, వాటితో ఉరితీత ట్రయల్స్ వేసి చూడాలని నిర్ణయించారు.

దోషుల బరువుకు సమానమైన బరువులను ఆ తాళ్లకు కట్టి ప్రయోగాత్మకంగా ఉరితీస్తారు. తద్వారా తాళ్లలో కానీ, ఉరికొయ్యలో కానీ ఏవైనా లోపాలుంటే సరి చేస్తారు. తీహార్ ప్రాంగణంలోని మూడో నెంబరు జైలు ఈ ట్రయల్స్ కు వేదిక కానుంది. ఈ ముందస్తు సన్నాహాల్లో జైలు సూపరింటిండెంట్ సహా అధికారులు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ అధికారులు పాల్గొంటారని తెలుస్తోంది.