ఆస్ట్రేలియా మొత్తం ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది: కార్చిచ్చుపై తెలంగాణ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ట్వీట్

08-01-2020 Wed 13:43
  • అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి 
  • మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడం బాధకలిగిస్తోంది
  • మంటలు అదుపులోకి రావాలని ప్రార్థిద్దాం 

ఆస్ట్రేలియాలోని అడవుల్లో కొన్ని నెలలుగా కార్చిచ్చు రగులుతోన్న విషయం తెలిసిందే. ఆ మంటలను ఆర్పేందుకు చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. అడవుల్లో విస్తరిస్తున్న దావానలం పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అగ్నికీలల ధాటికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మిలియన్ల సంఖ్యలో జంతువులు చనిపోయాయి.

దీనిపై టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ స్పందిస్తూ ట్వీట్ చేశారు. అగ్నికీలలు ఎగిసిపడుతోన్న కారణంగా ఆస్ట్రేలియా మొత్తం ప్రమాదాన్ని ఎదుర్కుంటోందని ఆయన అన్నారు. మంటల్లో లక్షలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడం బాధకలిగిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే ఆస్ట్రేలియా ఆడవుల్లో మంటలు అదుపులోకి రావాలని ప్రార్థిద్దామని సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ కష్ట సమయంలో ఆస్ట్రేలియా శ్రేయస్సు కోసం కూడా భగవంతుడిని ప్రార్థిద్దామన్నారు.