Bharat Band: కార్మిక సంఘాల పిలుపు మేరకు.. మొదలైన 'భారత్ బంద్'!

  • బ్యాంకింగ్, రవాణా రంగాలపై కనిపిస్తున్న ప్రభావం
  • తెలుగు రాష్ట్రాల్లో నామమాత్రపు ప్రభావం
  • పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో స్తంభించిన సేవలు

ప్రధాన కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ ఉదయం భారత్ బంద్ ప్రారంభమైంది. దీని ప్రభావం బ్యాంకింగ్, రవాణా రంగాలపై కనిపిస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్ లోనే నేడు సమ్మెను పాటించాలని ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, టీయూసీసీ, యూటీయూసీ తదితర కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, పెరిగిన నిరుద్యోగం, ఆర్థిక వృద్ధి మందగమనం తదితరాలను వ్యతిరేకిస్తూ, ఈ బంద్ జరుగుతోంది.

కాగా, సమ్మెలో తాము కూడా పాల్గొంటున్నామంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘాలు నిన్న అనూహ్యంగా నిర్ణయించడంతో, బంద్ ప్రభావం బ్యాంకులపైనా పడింది. మొత్తం 12 డిమాండ్లను కార్మిక సంఘాలు తెరపైకి తేగా, ఈ నెల 2న కేంద్ర కార్మిక మంత్రి వారితో చర్చించారు. ఈ చర్చల్లో ఎటువంటి నిర్దిష్టమైన హామీలూ రాకపోవడంతో సమ్మె అనివార్యమైందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వివరించారు.

ఇక ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల మంది పాల్గొంటున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ఈ నిరసనల్లో పాల్గొనరాదని కేంద్రం ఆదేశించింది. అత్యవసర సేవలు యథావిధిగా సాగేలా చూడాలని, బంద్ లో పాల్గొంటే క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు, వేతనాల కోత తప్పదని హెచ్చరించింది.

ఇదిలావుండగా, తెలుగు రాష్ట్రాల్లో బంద్ ప్రభావం నామమాత్రంగానే ఉంది. ఈ ఉదయం ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. స్కూళ్లన్నీ పని చేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో బస్సులను వామపక్ష నేతలు నిలిపివేసినట్టు సమాచారం. పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో బంద్ ప్రభావం అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News