సిక్సర్ తో మ్యాచ్ ముగించిన కోహ్లీ... ఇండోర్ టి20లో టీమిండియా ఘనవిజయం

07-01-2020 Tue 22:18
  • టీమిండియా టార్గెట్ 143 రన్స్
  • 17.3 ఓవర్లలో ఛేదన
  • 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన భారత్

ఇండోర్ లో శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 143 పరుగుల విజయలక్ష్యాన్ని 17.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సిక్సర్ తో మ్యాచ్ ముగించి తన క్లాస్ టచ్ చాటాడు. కోహ్లీ 17 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు, లక్ష్యఛేదనలో ఓపెనర్లు కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 45, ధావన్ 32, శ్రేయాస్ అయ్యర్ 34 పరుగులు చేసి విజయంలో తమవంతు పాత్ర పోషించారు. లంక బౌలర్లలో హసరంగ 2, లహిరు కుమార ఓ వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి మొదట శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగించింది. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ 3, కుల్దీప్, సైనా రెండేసి వికెట్లతో రాణించారు. కాగా, ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో టి20 జనవరి 10న పుణేలో జరగనుంది.