ఆ ముగ్గురు కాంబినేషన్లో చేయడానికి భయపడ్డాను: హీరోయిన్ అంజలి

07-01-2020 Tue 13:35
  • తొలి రోజు షూటింగులో వెంకటేశ్ ధైర్యం చెప్పారు 
  • ప్రకాశ్ రాజ్ గారు నాలోని భయాన్ని పోగొట్టారు
  • భయం పోవడానికి మూడు నాలుగు రోజులు పట్టిందన్న అంజలి  

తెలుగులో అంజలి చేసిన చెప్పుకోదగిన సినిమాల్లో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' ఒకటి. ఈ సినిమాలో ఆమె చేసిన 'సీత' పాత్రను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఆ సినిమాను గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో అంజలి ప్రస్తావించింది.

'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కోసం తొలి రోజునే వెంకటేశ్ .. ప్రకాశ్ రాజ్ .. జయసుధ కాంబినేషన్లో కలిసి నటించవలసి వచ్చింది. ముగ్గురూ సీనియర్ ఆర్టిస్టులు కావడంతో భయంతో నాకు చమటలు పట్టేశాయి. సరిగ్గా చేయలేనేమో .. నా వలన రీ టేక్ అంటే సీనియర్ ఆర్టిస్టులు ఫీలవుతారేమో అనేదే నా అసలు భయం. నా ఇబ్బందిని గ్రహించిన వెంకటేశ్ గారు 'ఫరవాలేదు నీకు వచ్చింది చెయ్' అన్నారు. ప్రకాశ్ రాజు గారు కూడా 'బంగారు తల్లి' అంటూ నాలోని భయాన్ని పోగొట్టారు. మూడు నాలుగు రోజుల తరువాత భయం పోవడంతో ఈజీగా చేసేశాను" అని చెప్పుకొచ్చింది.