జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ నాయకురాలు ఐషే ఘోష్ పై కేసు నమోదు

07-01-2020 Tue 10:54
  • ఐషే ఘోష్ సహా ఎనిమిది మందిపై కేసు నమోదు
  • జేఎన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్
  • సర్వర్ రూమ్ ను ధ్వంసం చేశారంటూ కేసు

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్ లో చోటు చేసుకున్న దాడుల్లో స్టూడెంట్స్ యూనియన్ నాయకురాలు ఐషే ఘోష్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమె తలకు ఐదు కుట్లు పడ్డాయి. ముసుగులు ధరించిన వ్యక్తులు కర్రలు, రాడ్లతో దాడి చేసిన ఘటనలో ఐషే ఘోష్ సహా 34 మంది గాయపడ్డారు. మరోవైపు, ఐషే ఘోష్ తో పాటు మరో ఎనిమిది మందిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. జేఎన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.

హాస్టల్ ఫీజు పెంపును నిరసిస్తూ సర్వర్ రూమ్ లో ఉన్న వస్తువులను దోచుకోవడంతో పాటు, గదిలోని పరికరాలను ధ్వంసం చేశారని ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. గదిలోకి ప్రవేశించే క్రమంలో సెక్యూరిటీ గార్డులపై కూడా దాడి చేశారని తెలిపారు. సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు విఘాతం కలిగించేలా టెక్నికల్ స్టాఫ్ ను భయపెట్టారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.