Saurav Ganguly: గంగూలీ చాలా తెలివైనవాడు.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఐసీసీ ఏమీ చేయలేదు: షోయబ్ అఖ్తర్

  • టెస్టులను నాలుగు రోజులకు కుదించే యోచనలో ఐసీసీ ఉంది
  • బీసీసీఐ అండ లేకుండా ఐసీసీ ఏమీ చేయలేదు
  • గంగూలీ ఈ ప్రతిపాదనకు ఒప్పుకోడు
టెస్ట్ క్రికెట్ ను ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించాలనే యోచనలో ఐసీసీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఐసీసీ ఆలోచనను సచిన్ తో సహా పలువురు క్రికెట్ దిగ్గజాలు తప్పుబడుతున్నారు. క్రికెట్ కు టెస్ట్ మ్యాచ్ లు గుండెకాయలాంటివని... వాటి స్వరూపాన్ని మార్చవద్దని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ కూడా తన స్పందనను తెలియజేశాడు.

టెస్ట్ క్రికెట్ కు ప్రేక్షకాదరణ పెంచాలనే ఉద్దేశంతో మ్యాచ్ లను నాలుగు రోజులకు కుదించాలని ఐసీసీ భావిస్తోందని... ఇది సరైన ఆలోచన కాదని షోయబ్ అన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఐసీసీ ఈ విషయంలో ముందడుగు వేయలేదని చెప్పాడు. గంగూలీ చాలా తెలివైనవాడని... క్రికెట్ పై ఆయనకున్న పరిజ్ఞానం అమోఘమని కితాబిచ్చాడు.

ఐసీసీ ప్రతిపాదనను గంగూలీ ఎప్పటికీ ఓకే కానివ్వడని షోయబ్ తెలిపాడు. టెస్ట్ క్రికెట్ ను గంగూలీ బతకనిస్తాడనే నమ్మకం తనకుందని చెప్పాడు. బీసీసీఐ మద్దతు లేకుండా ఈ ప్రతిపాదనను ఐసీసీ ముందుకు తీసుకెళ్లలేదని... అందువల్ల ఇది జరిగే పనే కాదని తేల్చి చెప్పాడు. ఐసీసీ ప్రతిపాదనను ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారని.. ఇతర క్రికెటర్లు కూడా వ్యతిరేకించాలని విన్నవించాడు.
Saurav Ganguly
Shoaib Akhtar
Test Matches
BCCI
ICC

More Telugu News