మధ్యలో మహేశ్ బాబు... అటు చిరంజీవి, ఇటు విజయశాంతి... హుషారుగా సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్

05-01-2020 Sun 20:33
  • ప్రారంభమైన సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్
  • హాజరైన మహేశ్ బాబు, చిరంజీవి, విజయశాంతి
  • ఉత్సాహంగా కొనసాగుతున్న ఈవెంట్

హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ ఉత్సాహభరితంగా సాగుతోంది. హీరో మహేశ్ బాబు తో పాటు ముఖ్య అతిథి మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు, చిరంజీవి ఒకే సోఫాలో కూర్చున్నారు. మహేశ్ బాబు మధ్యలో కూర్చోగా, అటు చిరంజీవి, ఇటు విజయశాంతి ఆసీనులయ్యారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు దర్శకుడు అనిల్ రావిపూడి, దిల్ రాజు, దేవిశ్రీప్రసాద్, ఆదిశేషగిరిరావు, సుధీర్ బాబు, రామజోగయ్యశాస్త్రి తదితరులు హాజరయ్యారు.

కాగా, ఎల్బీ స్టేడియంలోకి చిరంజీవి ఎంట్రీ ఇస్తున్న సమయంలో అభిమానుల హోరుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. ఈ సందర్భంగా చిరంజీవికి మహేశ్ బాబు ఆత్మీయస్వాగతం పలికారు. ఇక అభిమానులు వేలాదిగా హాజరవడంతో ఎల్బీ స్టేడియంలో ఇసుకేస్తే రాలనంతగా జనసంద్రం కనిపిస్తోంది. ఈ సినిమా ఈవెంట్ మహేశ్ బాబుకు చెందినదైనా మెగాస్టార్ చిరంజీవిపై ప్రత్యేకంగా ఎ.వి ప్రదర్శించడం విశేషంగా చెప్పాలి.