realter: సొంతింటి ఆశ చూపించి రూ.కోట్లు కొల్లగొట్టాడు!

  • తక్కువ ధరకే ఇళ్లు అంటూ లక్షల్లో అడ్వాన్స్ వసూలు 
  • బిచాణా ఎత్తేసిన వ్యాపారి 
  • లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు

మధ్య తరగతి వారికి సొంతిల్లు ఓ కల. ఆ కలనే తన దోపిడీకి మార్గంగా ఎంచుకున్నాడు ఓ వ్యాపారి. హైదరాబాద్ మహానగరంలో అతి తక్కువ ధరకు ఇళ్లు కట్టి ఇస్తున్నట్లు ప్రకటించడంతో జనం క్యూకట్టారు. అడ్వాన్స్ పేరుతో ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేశాక బిచాణా ఎత్తేశాడు. పోలీసుల కథనం మేరకు...కాచిగూడ ప్రాంతానికి చెందిన నిమిత్ కపాసీ కుత్బిగూడలో మెడికల్ ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. తక్కువ ధరకే ప్లాట్లు, అపార్ట్ మెంట్లు, దుకాణ సముదాయాలు నిర్మించి ఇస్తానని నమ్మబలికాడు.

ఆసక్తి గల వారు కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే చాలని, మిగిలిన దాన్ని బ్యాంకుల ద్వారా తానే సమకూర్చుతానని నమ్మించాడు. దీంతో నిమిత్ కపాసీ వలలో పలువురు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారులతోపాటు అతని స్నేహితులు కూడా పడ్డారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేశాడు.

వీరివద్ద నుంచి కోట్లు కొట్టేసిన నిమిత్ చడీచప్పుడు లేకుండా పరారయ్యాడు. నిమిత్ తోపాటు కుటుంబం కూడా కనిపించక పోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు సుల్తాన్‌ బజార్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ విధంగా ఇతని మాయలో పడిన వారు ఇప్పటి వరకు 25 మంది బయటకు వచ్చారు.

More Telugu News