Maharashtra: 'మహా' సర్కార్ లో ముసలం.. మంత్రి పదవికి రాజీనామా చేసిన అబ్దుల్ సత్తార్

  • మహారాష్ట్ర కేబినెట్ లో ఉన్న ఏకైక ముస్లిం మంత్రి
  • శాఖ కేటాయించలేదని అలక 
  • మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్తార్

మహారాష్ట్రలో కొలువుదీరిన 'మహా వికాస్ అఘాడీ' ప్రభుత్వ ప్రయాణం మూడు షాక్ లు...ఆరు అసంతృప్తులన్నట్టు సాగుతోంది. ప్రభుత్వం కొలువుదీరిన నెలరోజుల తర్వాతగాని మంత్రివర్గ విస్తరణ జరగలేదు. వారం క్రితం మంత్రి వర్గ విస్తరణ జరగగా, పదవులు దక్కని పలువురు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. వీరికి సర్దిచెప్పడమే పెద్ద తలనొప్పిగా మారిందంటే తాజాగా కేబినెట్ లోని ఏకైక ముస్లిం మంత్రి అబ్దుల్ సత్తార్ రాజీనామా చేసి షాకిచ్చారు.

మంత్రి వర్గ విస్తరణ జరిగి ఐదు రోజులైనా తనకు శాఖ కేటాయించక పోవడంతో మనస్తాపానికి గురైన ఆయన రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. తన రాజీనామా లేఖను నేరుగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు ఇచ్చారు. సిల్లోద్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్తార్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కొన్నాళ్లు మంత్రిగా పనిచేశాడు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఔరంగాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించిన ఆయన ఆశలపై కాంగ్రెస్ అధిష్ఠానం నీళ్లు చల్లింది. దీంతో బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా స్థానిక నేతల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఎన్నికల ముందు శివసేన కండువా కప్పుకున్నారు.

  • Loading...

More Telugu News