West Bengal: లాటరీ కొట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు... బెదిరింపులు మొదలయ్యాయి!

  • పశ్చిమ బెంగాల్ లో ఘటన
  • నిరుపేదకు తగిలిన రూ. 1 కోటి లాటరీ
  • అప్పటి నుంచి బెదరింపులు
  • రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి

ఇందిరా నారాయణన్... 70 సంవత్సరాల ఈ వ్యక్తి పేరు నిన్నటి వరకూ ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడాయన పేరు పశ్చిమ బెంగాల్ లో మారు మోగుతోంది. ఇటీవలే ఆయన్ను లక్ష్మీ దేవి కరుణించగా, కోటి రూపాయల లాటరీ తగిలింది. తన జీవితంలో ఎన్నడూ కోరుకోనంత డబ్బును ఒకేసారి చూడటంతో పాటు, అతనికి కష్టాలూ వచ్చేశాయి.

ఆదివారం అతనికి లాటరీ తగిలింది. ఈ విషయం బయటకు తెలియగానే, అతనికి బెదరింపులు మొదలయ్యాయి. ఒత్తిడి పెరిగింది. తన ప్రాణాలకు ముప్పు వచ్చిందని భావించిన నారాయణన్, ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా కల్నా పోలీసు స్టేషన్ కు వచ్చిన ఆయన, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు.

గతంలో బోర్లు వేసే పనిలో ఉన్న ఆయన, పదేళ్ల క్రితమే రిటైర్ మెంట్ తీసుకుని, నెలకు రూ. 10 వేల పెన్షన్ తీసుకుంటూ, ఈస్ట్ బురుద్వాన్ లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల రూ. 60 పెట్టి, 10 నాగాలాండ్ స్టేట్ లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. "గుప్తిపారా మార్కెట్ నుంచి నేను వాటిని కొన్నాను. వాటిని నా జేబులో మడిచి పెట్టుకున్నానే తప్ప, ఫలితాలను కూడా చూడలేదు" అని నారాయణన్ వ్యాఖ్యానించాడు.

తనకు టికెట్లను అమ్మిన లాటరీ సెంటర్ యజమాని మింటూ బిశ్వాస్, తనకు లాటరీ తగిలిన విషయాన్ని చెప్పాడని, అతని ద్వారానే తనకు విషయం తెలిసిందని చెప్పాడు. అప్పటి నుంచి తనకు బెదరింపులు వస్తున్నాయని, అందుకే పోలీసు రక్షణ కోరుతున్నానని చెప్పారు.

More Telugu News