Alla Ramakrishna Reddy: నిరూపించండి.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: ఎమ్మెల్యే ఆర్కే

  • నీరుకొండలో భూములు కొన్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా
  • అక్రమాలకు పాల్పడింది చంద్రబాబే
  • చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కొత్త బినామీ
అమరావతి భూములు మీరు కొన్నారంటే, మీరు కొన్నారంటూ వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ఎవరెవరు ఎన్ని ఎకరాల భూములు కొన్నారో వెల్లడించారు.

దీనికి కౌంటర్ గా టీడీపీ నేతలు కూడా ఒక జాబితాను బయటపెట్టారు. అమరావతి ప్రాంతంలో భూములను కొన్న వైసీపీ నేతలు వీరే అంటూ పేర్లను వెల్లడించారు. ఈ జాబితాలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో, ఈరోజు తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆర్కే... వివరణ ఇచ్చారు.

రాజధాని పేరిట అక్రమాలకు పాల్పడింది టీడీపీ అధినేత చంద్రబాబేనని ఆర్కే ఆరోపించారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఆయన ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్టు ఆధారాలతో సహా నిరూపించామని చెప్పారు. దళితుల భూములను కాజేసిన చంద్రబాబు... వాటిని బినామీలకు కట్టబెట్టారని అన్నారు. నీరుకొండలో తాను ఐదు ఎకరాల భూమిని కొన్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.

రాజధానిలో ఇల్లు కట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? అని ఆర్కే ప్రశ్నించారు. క్విడ్ ప్రోకోలో భాగంగా లింగమనేని ఇంట్లో ఆయన ఉంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త బినామీ అని... అర్ధరాత్రి సమయంలో కరకట్ట వద్దకు వెళ్లి చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు దోపిడీని సమర్థిస్తూ, అమరావతిలో పవన్ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. మంగళగిరిలో జనసేన ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.
Alla Ramakrishna Reddy
YSRCP
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena

More Telugu News