pubg game: పబ్జీ గేమ్‌కు బానిసై, జల్సాలకు ఆకర్షితుడై.. దొంగగా మారిన యువ పూజారి

  • కేటరింగ్ పనులు చేస్తూ కుమారుడిని వేదాలు చదివించిన తల్లి
  • జల్సాలకు డబ్బులు సరిపోక దొంగగా మారిన యువకుడు
  • ఆట కట్టించిన మల్కాజిగిరి పోలీసులు

ఆమె కేటరింగ్ పనులు చేస్తూ కుమారుడిని వేదాలు చదివించి ఓ ఆలయంలో పురోహితుడిగా చేర్చితే.. ఆ యువకుడు మాత్రం పబ్జీ గేమ్‌కు బానిసై, జల్సాలకు ఆకర్షితుడై దొంగగా మారాడు. గేర్ సైకిళ్లను చోరీ చేస్తూ అమ్మగా వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేసేవాడు. చివరికి పోలీసులకు దొరికిపోయి తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో జరిగిందీ సంఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీలోని మంగాపురానికి చెందిన నందుల సిద్ధార్థశర్మ (19) ఓ ఆలయంలో పురోహితుడిగా పనిచేస్తున్నాడు. మనస్పర్థల కారణంగా తల్లిదండ్రులు వేరుపడడంతో తల్లే అతడిని కేటరింగ్ పనులు చేస్తూ వేదాలు చదివించింది. అనంతరం ఓ ఆలయంలో పురోహితుడిగా చేర్చింది. అయితే, పబ్జీగేమ్‌కు బానిసైన సిద్ధార్థ.. పనిపై మనసును లగ్నం చేయలేకపోయేవాడు. మరోవైపు, జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో ఆదాయం సరిపోక వక్రమార్గం పట్టాడు.

రద్దీ ప్రాంతాల్లో పార్క్ చేసిన గేర్ సైకిళ్లను దొంగతనం చేసి అతి తక్కువ ధరకు అమ్మేవాడు. అలా, గత ఆరు నెలల కాలంలో మల్కాజిగిరి, నేరేడ్‌మెట్, కుషాయిగూడ, నాచారం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకంగా 31 సైకిళ్లను చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు సిద్ధార్థశర్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి రూ.3.50 లక్షల విలువైన 31 గేర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News