తన చేయి పట్టుకుని లాగిన మహిళపై పోప్ ఫ్రాన్సిస్ ఆగ్రహం.. అనంతరం ఆమెకు క్షమాపణ!

02-01-2020 Thu 06:27
  • గుంపులో నడుస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పోప్
  • గుంపు మధ్య నుంచి పోప్ చేయి పట్టుకున్న మహిళ
  • హఠాత్ పరిణామానికి విస్తుపోయిన పోప్

తన చేతిని పట్టుకుని లాగిన మహిళపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ తాజాగా ఆ మహిళకు క్షమాపణలు చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మంగళవారం వాటికన్ సిటీలోని పీటర్ స్క్వేర్‌లో పోప్.. చిన్నారులు, భక్తుల మధ్యలో నడుస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో గుంపులోంచి ఓ మహిళ అకస్మాత్తుగా ఏదో అంటూ పోప్ చేయి పట్టుకుని తన వైపునకు లాగింది.

ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన పోప్.. ఆ మహిళ చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేసి, సదరు మహిళ చేతిపై చిన్న దెబ్బ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్పందించిన పోప్ తాను ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళకు బుధవారం క్షమాపణలు చెప్పారు.