నన్ను కామెంట్ చేసిన వ్యక్తిని సుందర్ వెంబడించి మరీ కొట్టాడు: ఖుష్బూ

31-12-2019 Tue 12:07
  • సుందర్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు 
  •  ఇద్దరం ఐదేళ్లపాటు కష్టపడ్డాం 
  • 'పొల్లాచ్చి' షూటింగులో అలా జరిగిందన్న ఖుష్బూ
వివిధ భాషల్లో కథానాయికగా ఖుష్బూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. "సుందర్ తన మొదటి సినిమా సమయంలోనే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ముందుగా కెరియర్ పై దృష్టి పెట్టమనీ, ఆర్ధికంగా నిలదొక్కుకున్న తరువాత పెళ్లి చేసుకుందామని చెప్పాను. అలా ఐదేళ్లు గడిచిన తరువాత .. అనుకున్న గోల్ చేరుకున్నాక పెళ్లి చేసుకున్నాము.

ఒకసారి సుందర్ దర్శకత్వంలో నేను ఒక సినిమా చేస్తున్నాను .. 'పొల్లాచ్చి'లో షూటింగ్ జరుగుతోంది. నేను ఏనుగును ఎక్కి వెళుతున్న సీన్ చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్ చూడటానికి వచ్చిన ఓ వ్యక్తి నన్ను కామెంట్ చేశాడు. అలా మాట్లాడకూడదని సుందర్ చెప్పినా, తాగేసి వున్న అతను వినిపించుకోలేదు. దాంతో సుందర్ అతని వెంటపడ్డాడు.. అతను పరుగులంఘించుకుంటే వెంబడించి మరీ కొట్టాడు" అని చెప్పుకొచ్చారు.