Hyderabad: ఎల్బీనగర్‌లో అదుపు తప్పి అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన కారు

  • బర్త్ డే పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ఘటన
  • డివైడర్ నుంచి అవతలికి ఎగిరిపడిన కారు
  • నలుగురికి తీవ్ర గాయాలు
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 29న అర్ధరాత్రి ఓ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. తుర్కయాంజల్ కమ్మగూడ సమీపంలోని సుందరయ్య కాలనీకి చెందిన వల్లపు రవీందర్ (30) వృత్తిరీత్యా కారు డ్రైవర్ అయినా, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఇటీవల ఓ స్విప్ట్ డిజైర్ కారును కొనుగోలు చేశాడు. ఈ నెల 29న తన స్నేహితుడు రత్లావత్ కృష్ణ (25) బర్త్‌డే సందర్భంగా అందరూ కలిసి పార్టీ చేసుకోవాలని నిర్ణయించారు. మరో స్నేహితుడైన  శివ (25), వెంకటేశ్, కృష్ణ, రత్లావత్ కృష్ణను తీసుకుని రవీందర్ తన కారులో నగరానికి వచ్చాడు. పార్టీ అనంతరం అర్ధరాత్రి తిరిగి కమ్మగూడకు బయలుదేరారు.

కారు హస్తినాపురం వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న మరో కారును ఢీకొని, కుడివైపున డివైడర్ పైనుంచి ఎగిరిపడి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. అదే సమయంలో బీఎన్‌రెడ్డి నగర్ నుంచి బైక్‌పై వస్తున్న సాయిరాం (19)ను ఢీకొంది. ఈ ఘటనలో సాయిరాం గాయపడ్డాడు. ఆ సమయంలో రత్లావత్ కృష్ణ కారు నడుపుతున్నాడు. కారులో ఉన్న రవీందర్ కాలు విరగడంతోపాటు తలకు దెబ్బ తగిలింది. అలాగే, కారులో ఉన్న మిగతా వారికి కూడా బలంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
LB Nagar
Road Accident

More Telugu News