Priyanka Gandhi: ఓ సీఎం ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటాననడం ఇదే తొలిసారి: యోగిపై ప్రియాంక విసుర్లు

  • యూపీ సర్కారుతో ఢీ అంటే ఢీ అంటున్న ప్రియాంక
  • సీఎం యోగిపై వ్యాఖ్యలు
  • కాషాయం ధరిస్తే సరిపోదంటూ వ్యంగ్యం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మధ్య ఆవేశపూరిత వాతావరణం ఏర్పడింది. లక్నోలో ప్రియాంకను పోలీసులు అడ్డగించడం, ఆపై జరిగిన పరిణామాలు కాంగ్రెస్ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. తాజాగా, పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించడం పట్ల ప్రియాంక స్పందించారు. ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటానని ఓ సీఎం అనడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అని వ్యాఖ్యానించారు.

హిందూ ధర్మం అంటే శాంతికి ప్రతిరూపమని, కాషాయానికి అర్థం కూడా అదేనని అన్నారు. కానీ, కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి నోట ప్రతీకారం అనే మాట రావడం దారుణమని పేర్కొన్నారు. కాషాయం ధరించినంత మాత్రాన హిందుత్వానికి ప్రతీకలు అయిపోరని యోగికి చురకలంటించారు. యూపీలో అధికారులు, పోలీసులు యోగి ఏంచెబితే అది చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News