సెల్‌ఫోన్ టవర్‌తో భారీ ఆదాయమంటూ ప్రకటన.. నమ్మి లక్షలు పోగొట్టుకున్న వృద్ధురాలు!

29-12-2019 Sun 08:38
  • హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌లో ఘటన
  • పత్రికా ప్రకటన చూసి రూ.25 లక్షలు మోసపోయిన వృద్ధురాలు
  • ఇలా ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలన్న పోలీసులు

సెల్‌ఫోన్ టవర్‌తో బోల్డంత ఆదాయమంటూ పత్రికల్లో వచ్చిన ప్రకటన చూసిన ఓ వృద్ధురాలు లక్షలాది రూపాయలు పోగొట్టుకుంది. నిండా మునిగిన తర్వాత మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సెల్‌ఫోన్ టవర్ ఏర్పాటుకు స్థలం కావాలంటూ ఓ పత్రికలో వచ్చిన ప్రకటన చూసిన 60 ఏళ్ల వృద్ధురాలు.. ప్రకటనలో ఉన్న మొబైల్ నంబరుకు  ఫోన్ చేసింది. తాము ఓ సెల్‌ఫోన్ సంస్థ ప్రొవైడర్లమని పేర్కొన్న నిందితుడు వృద్ధురాలిని మాయమాటలతో ముగ్గులోకి దించాడు. తాము ఏర్పాటు చేయబోయే టవర్‌కు అదే సరైన స్థలమని పేర్కొన్నాడు. అంతేకాదు, ఏడాదికి రూ. 90 లక్షలు వస్తుందని నమ్మించాడు. డబ్బులు ప్రతి నెలా బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని చెప్పడంతో బాధితురాలు నమ్మేసింది.

తొలుత ఒప్పందంలో భాగంగా రూ.5 వేలు చెల్లించాలని చెప్పడంతో ఆమె చెల్లించింది. ఆ తర్వాత టవర్ నిర్మాణానికి డిపాజిట్ అంటూ మరో రూ.5 లక్షలు వసూలు చేశాడు. అలా మొత్తంగా నవంబరు 15 నుంచి డిసెంబరు 12వ తేదీ మధ్య ఏకంగా రూ. 25 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత అతడి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పత్రికల్లో వచ్చిన ఇలాంటి ప్రకటనలు నమ్మవద్దని, ఎవరైనా ఇలాంటి ప్రకటన ద్వారా నమ్మించే ప్రయత్నం చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని, లేదంటే 94906 16555 వాట్సాప్ నంబరు ద్వారా సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.