sikkim: సిక్కింలో భారీ హిమపాతం.. చిక్కుకుపోయిన 1700 మంది పర్యాటకులు

  • నాథులా కనుమ సమీపంలో ఘటన
  • 300 వాహనాల్లో ప్రయాణికులు
  • రక్షించి ఆర్మీ క్యాంపునకు తరలించిన వైనం

భారీ హిమపాతం కారణంగా మంచులో చిక్కుకుపోయిన 1700 మంది పర్యాటకులను భారత సైన్యం రక్షించింది. సిక్కింలోని నాథులా కనుమ సమీపంలో ఈ ఘటన జరిగింది. సోమ్‌గో సరస్సు నుంచి 300 వాహనాల్లో పర్యాటకులు తిరిగి వస్తుండగా నాథులా సమీపంలో జవహర్‌లాల్ రోడ్డును మంచు పూర్తిగా కప్పేసింది. దీంతో పర్యాటక వాహనాలు ముందుకు కదల్లేక ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మంచు తుపానులో వారంతా చిక్కుకుపోయారు.

సమాచారం అందుకున్న ఆర్మీ వెంటనే రంగంలోకి దిగింది. మొత్తం 1700 మంది పర్యాటకులను రక్షించి ఆర్మీ క్యాంపునకు తరలించి ఆశ్రయం కల్పించారు. వారికి ఆహారం, మందులు, దుస్తులు అందించారు. రోడ్డుపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. రోడ్లను క్లియర్ చేసిన తర్వాత పర్యాటకులను స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు.

More Telugu News