CAA: రాజకీయ నేతలు ఏం చేయాలో సైన్యాధిపతి చెప్పాల్సిన అవసరం లేదు: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం

  • ఇటీవలి నిరసనలపై బిపిన్ రావత్ వ్యాఖ్యలు  
  • మండిపడుతున్న ప్రతిపక్షాలు
  • మీ పనేదో మీరు చూసుకుంటే మంచిదని చురక

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తీవ్రంగా ఆక్షేపించారు. సీఏఏపై జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారడాన్ని బిపిన్ రావత్ ఇటీవల తప్పుబట్టారు. ప్రజలను దాడులకు ప్రేరేపించడం నాయకత్వం కాదని ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. రావత్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి.  

తాజాగా, రావత్ వైఖరిని చిదంబరం తప్పుబడుతూ.. రాజకీయ నాయకులు ఏం చేయాలో సైన్యాధిపతి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మీ పనేదో మీరు చూసుకుంటే చాలని వ్యంగ్యంగా పేర్కొన్నారు. సీఏఏను నిరసిస్తూ..కేరళలో కాంగ్రెస్ చేపట్టిన మహా ర్యాలీలో పాల్గొన్న చిదంబరం మాట్లాడుతూ..‘సీఏఏపై ప్రభుత్వం తరపున మాట్లాడాలని సైన్యాధిపతిని, ఉత్తరప్రదేశ్ డీజీపీలను అడగటం సిగ్గుచేటు. జనరల్ రావత్ ను కోరేదొక్కటే.. మీరు సైన్యానికి అధిపతి. ఆ పని చూసుకోండి. రాజకీయ నాయకుల పనేంటో చెప్పడం మీ విధి కాదు. మీరు శత్రువులతో ఎలా యుద్ధం చేయాలో మేము చెప్పం కదా. ఇది కూడా అలాంటిదే. దేశ రాజకీయాలను మేము చూసుకోగలము’ అని చిదంబరం చురక అంటించారు. 

More Telugu News