సైకిల్ పై వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.. కలెక్టర్‌ను చూసి నివ్వెరపోయిన సిబ్బంది

28-12-2019 Sat 11:11
  • నిజామాబాద్ జిల్లా అధికారి సరికొత్త రూటు 
  • రోగులు, బంధువులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా
  • పట్టించుకోని రోగికి వైద్య సహాయం

ప్రభుత్వ అధికారులంటే ప్రజా సేవకులన్న నిర్వచనానికి అచ్చుగుద్దినట్టు వ్యవహరించారు ఆ కలెక్టర్. జిల్లా అధికారి అయినప్పటికీ మందీమార్బలాన్ని వెంటేసుకుని బయలుదేరకుండా ఓ సామాన్యుడిలా ఒక్కరే సైకిల్ ఎక్కారు. రయ్ మంటూ ప్రభుత్వ ఆసుపత్రికి దూసుకుపోయారు. అక్కడ అందుతున్న సేవలపై ఆరాతీశారు. తొలుత ఎవరో పేషెంట్ అనుకున్న సిబ్బంది వచ్చింది కలెక్టర్ అని తెలియడంతో కాసేపు షాక్ కు గురయ్యారు. ఈ ఆసక్తికర పరిణామం నిజామాబాద్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే...నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా రెండు రోజుల క్రితమే నారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అధికారులకు ఇంకా ఆయన పూర్తిగా పరిచయం కాలేదు. నిన్న ఉదయం సాధారణ వ్యక్తిలా ఆయన సైకిల్ పై నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. కానీ ఎవరూ ఆయన్ను గుర్తించలేదు.

అక్కడి రోగులు, వారి బంధువులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరాతీశారు. ఓ రోగిని ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదని తెలిసి అతని గురించి వైద్యులతో మాట్లాడారు. వారి బాధ్యతను గుర్తు చేశారు. ఎప్పటిలాగే 'నువ్వెవరు మాకు చెప్పడానికి' అన్నట్లు ఒక లుక్కిచ్చి వారు వెళ్లిపోయారు. దీంతో ఆయన తలపై టోపీ తీసి తాను కలెక్టర్‌నని చెప్పేసరికి సిబ్బందికి చెమటలు పట్టేశాయి.

ఉరుకులు పరుగుల మీద రోగికి సేవలందించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది బయోమెట్రిక్ హాజరు పరిశీలించారు. మొత్తం 210 మంది సిబ్బందిలో సగం కంటే ఎక్కువ అంటే 111 మంది హాజరు కాలేదు. వారందరికీ మెమోలు పంపించాలని ఆదేశించారు.

అనంతరం కాన్సుల వార్డుకు వెళ్లి సేవల గురించి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సేవల గురించి ఆరాతీశారు. మంచినీరు సరఫరా చేస్తున్న వ్యక్తి అధిక ధరకు అమ్మడాన్ని గుర్తించి అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.