Kerala: ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబినారాయణన్ కు పరిహారం: కేరళ సర్కార్ ఆమోదం

  • కోర్టు తీర్పు మేరకు రూ.1.3 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్
  • గూఢచర్యం కేసులో అరెస్టయిన నంబి 
  • కోర్టు నిర్దోషి అని తేల్చడంతో పరిహారం కోసం డిమాండ్

ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబినారాయణన్ కు కోర్టు ఆదేశాల మేరకు కోటి 30 లక్షల రూపాయల పరిహారం చెల్లించేందుకు కేరళ ప్రభుత్వం అంగీకరించింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. 1990లో ఇస్రోలో పాకిస్థాన్ గూఢచర్యం కేసు సంచలనం సృష్టించింది. ఇస్రోకు చెందిన కీలక రహస్యాలను నంబినారాయణన్, ఆయన సహచర శాస్త్రవేత్తలు డి.శివకుమార్, మరో నలుగురు కలిసి పాకిస్థాన్‌కు అమ్ముకున్నారంటూ అభియోగాలు నమోదయ్యాయి. ఈ కారణంగా అరెస్టయిన నంబినారాయణన్ 50 రోజులపాటు జైల్లో ఉన్నారు.

కేసును విచారించిన సుప్రీంకోర్టు నంబినారాయణన్ ను నిర్దోషిగా ప్రకటించింది. ఆయనపై ఆరోపణలను 1998లో కొట్టేసింది. ఆ సందర్భంగా నంబినారాయణన్ ను అకారణంగా అరెస్టు చేశారని, చిత్రహింసలపాలు చేశారని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. జైలు నుంచి బయటకు వచ్చిన నారాయణన్ కు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం కూడా అందజేసి సత్కరించింది.

అయితే జైలు జీవితం సందర్భంగా కస్టడీలో పోలీసులు తనను , శారీరకంగా, మానసికంగా హింసించారని ఆరోపించడమేకాక బలవంతంగా తనతో తప్పుడు ప్రకటనలు చేయించారని ఆరోపిస్తూ నారాయణన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు పరిశీలించిన కోర్టు 1.3 కోట్ల పరిహారం చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు మేరకు కేరళ కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది.

More Telugu News