YSRCP: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేలా మా ప్రభుత్వం ఆలోచిస్తోంది: అంబటి రాంబాబు

  • కృష్ణా, గుంటూరు వైసీపీ ఎమ్మెల్యేలతో ముగిసిన సీఎం భేటీ  
  • అమరావతిలో ఉన్న నిర్మాణాలన్నీ పూర్తి చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు
  • రాజధాని అంటే కొత్త పట్టణాలు కాదు

కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం, మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించామని చెప్పారు. అమరావతిలో ఉన్న నిర్మాణాలన్నీ పూర్తి చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదని అన్నారు.  వేల, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజధాని నిర్మించాలన్నది ‘రాంగ్ ఒపీనియన్’ అని అన్నారు.

రాజధాని అంటే కొత్త పట్టణాలు కాదు.. సచివాలయం, శాసనసభ, హైకోర్టు నిర్మించడం అని అన్నారు. రాజధాని కోసం నగరాన్ని నిర్మించడం కాదు, నగరంలోనే రాజధాని పెట్టాలని భావిస్తున్నామని అంబటి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక వనరులు అడుగంటిపోయాయని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేలా తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రానికి ఇలాంటి రాజధాని నిర్మించడం మరింత ఇబ్బంది అని, అనివార్యమైన పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని భావించారు.

తాత్కాలిక రాజధానిపై ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారని, ఈ రాజధానిని ఎలా ఉపయోగించాలనే దానిపై ఆలోచిస్తున్నామని, రైతులను సంతోష పరిచేలా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. అమరావతి ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ గా, ఐటీ హబ్ గా లేదా విద్యా సంస్థలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలన్న సంకల్పం తమ ప్రభుత్వానికి ఉందని, దీనిపైనా చర్చించామని, ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

More Telugu News