వైసీపీ ప్రభుత్వం చేసేవన్నీ తప్పులే: టీడీపీ నేత వర్ల రామయ్య

25-12-2019 Wed 20:28
  • సీఎం హోదాను జగన్ దురుపయోగం చేస్తున్నారు
  • ప్రభుత్వాన్ని కొన్ని శక్తులు నడిపిస్తున్నాయి
  • జాస్తి కృష్ణ కిషోర్ వ్యవహారంలో ట్రైబ్యునల్ సర్కారుపై మొట్టికాయలు వేసిందని వ్యాఖ్య
  • ప్రజల దృష్టిని మార్చటానికే రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారు

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారని టీడీపీ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ సర్కార్‌పై ఇన్ని విమర్శలు వస్తున్నా ఎందుకు స్పందించడం లేదంటూ.. ప్రభుత్వాన్ని కొన్ని శక్తులు నడిపిస్తున్నాయని, ఇకనైనా వాటిని నిరోధించాలన్నారు.

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ వ్యవహారంలో ట్రైబ్యునల్ స్పందించిన తీరుకు సీఎం సిగ్గుపడాలన్నారు. వేరే సీఎం అయితే తక్షణం రాజీనామా చేసేవారన్నారు. కృష్ణ కిషోర్ తప్పు చేశారని ఏ సంస్థ నిర్ధారించిందని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం చేసేవన్నీ తప్పులేనని, ప్రజల దృష్టిని మార్చటానికే రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని వర్ల రామయ్య ఆరోపించారు. సీఎం జగన్ తన పదవిని ప్రత్యర్ధులను టార్గెట్ చేసుకుని కక్ష సాధించేందుకు ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.