కుమార్తె స్నేహితురాలితో సంబంధం... ఆమె చేతిలోనే దారుణ మరణం!

25-12-2019 Wed 11:23
  • తమిళనాడులో వ్యాపారిగా స్థిరపడిన అమ్మన్ శేఖర్
  • ప్రియురాలు పవిత్రకు పెళ్లి నిశ్చయం కావడంతో బెదిరింపులు
  • బయటకు తీసుకెళ్లి హత్య చేసిన పవిత్ర

తన కుమార్తె వయసున్న ఆమె స్నేహితురాలితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకుని, ఆమెకు పెళ్లి నిశ్చయమైందన్న అక్కసుతో బెదిరింపులకు దిగి, చివరకు ఆమె చేతిలోనే దారుణ హత్యకు గురైన ఓ వ్యక్తి ఉదంతమిది. తమిళనాడు తిరువొత్తియూరు పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే...

తూత్తుక్కుడి జిల్లాకు చెందిన అమ్మన్ శేఖర్ (54), కర్పూరం హోల్ సేల్ వ్యాపారం చేస్తూ, చెన్నైలో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉండగా, కుమార్తె కోసం ఆమె స్నేహితురాలు పవిత్ర (25) తరచూ వచ్చిపోతుండేది. ఆమెపై వాంఛను పెంచుకున్న అమ్మన్ శేఖర్, బహుమతులు ఇస్తూ, సన్నిహితుడయ్యాడు. పవిత్రతో వివాహేతర బంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఇద్దరూ చాలా ప్రాంతాలకు విహారానికి వెళ్లి ఎంజాయ్ చేస్తుండేవారు.

ఈ క్రమంలో పవిత్రకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న అమ్మన్ శేఖర్, గతంలో తాను తీసి దాచుకున్న అశ్లీల వీడియోలను ఆమెకు చూపించి, బెదిరింపులకు దిగాడు. అప్పటివరకూ అతనితో కలిసి తిరిగిన పవిత్ర, ఇక తన జీవితం నాశనమవుతుందని భావించి, హత్య చేయాలని నిర్ణయించుకుంది. సోమవారం సాయంత్రం అతన్ని కలిసి, బయటకు తీసుకెళ్లింది. బీసెంట్ నగర్, హార్బర్ క్వార్టర్స్ గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో తిరిగి, నిర్మానుష్య ప్రదేశాన్ని చూసుకుని, వాహనాన్ని ఆపమని కోరింది.

ఓ బహుమతిని ఇస్తానని, కళ్లుమూసుకోవాలని పవిత్ర కోరగా, అమ్మన్ శేఖర్ కళ్లు మూసుకున్నాడు. ఆ వెంటనే తనతో తెచ్చుకున్న మత్తుమందు స్ప్రేను ముఖంపై చల్లి, కత్తితో గొంతుపై బలంగా పొడిచి పారిపోయింది. అప్పటికే స్పృహ తప్పిన అమ్మన్ శేఖర్, కాసేపట్లోనే ఘటనా స్థలిలోనే మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పవిత్రను అరెస్ట్ చేయగా, ఆమెను ఉరి తీయాలని అమ్మన్ శేఖర్ కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.