రాజకీయాల్లో మరోమారు సంచలనం రేపిన ఝార్ఖండ్ బీజేపీ రెబల్ సరయూ రాయ్!

25-12-2019 Wed 10:10
  • సీఎం రఘుబర్ దాస్ కేబినెట్‌లో పనిచేసి ఆయననే ఓడించిన రాయ్
  • ఇద్దరు సీఎంలను జైలుకు పంపిన ఘనత
  • రాజకీయాల్లో ‘జెయింట్ కిల్లర్’గా పేరు

ఝార్ఖండ్ రాజకీయాల్లో ‘జెయింట్ కిల్లర్’గా పేరు తెచ్చుకున్న బీజేపీ మాజీ నేత సరయూ రాయ్ మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్‌పై పోటీ చేసి 15 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఉమ్మడి బీహార్‌ రాష్ట్రంలో చక్రం తిప్పిన సరయూరాయ్ ఇద్దరు ముఖ్యమంత్రులను జైలుకు పంపిన ఘనతను సొంతం చేసుకున్నారు.

అంతేకాదు, నిన్నమొన్నటి వరకు రఘుబర్ దాస్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తూనే ఆయనపైనా, సహచర మంత్రులపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా జంషెడ్‌పూర్ పశ్చిమ టికెట్ కేటాయించేందుకు అధిష్ఠానం నిరాకరించడంతో పార్టీకి రాజీనామా చేశారు. జంషెడ్‌పూర్ తూర్పు నుంచి పోటీచేసి సీఎంపైనే గెలిచి మరోమారు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.

అవినీతిపై పోరులో ముందుండే సరయూరాయ్ సొంత పార్టీ నేతలను కూడా వదిలిపెట్టేవారు కాదు. బడా నేతల అవినీతిని బయటకు తీసి జైలుకు పంపడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. దాణా కుంభకోణంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్, బొగ్గు కుంభకోణంలో ఝార్ఖండ్ మాజీ సీఎం మధు కోడాలు జైలు పాలవడం వెనక సరయూ రాయ్ పాత్ర ఉంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఝార్ఖండ్ రాజకీయాల్లో జెయింట్ కిల్లర్‌గా పేరు సంపాదించుకున్నారు.