బాత్ రూమ్ లో కిందపడి రాత్రల్లా జ్ఞాపకశక్తిని కోల్పోయా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో

25-12-2019 Wed 09:19
  • సోమవారం నాడు ఘటన
  • మరుసటి రోజు ఉదయం వరకూ 'గజనీ'
  • ప్రస్తుతం బాగున్నానంటూ ఇంటర్వ్యూ

తన అధికారిక నివాసంలోని బాత్ రూములో కాలు జారి కిందపడగా, తన తలకు బలమైన దెబ్బ తగిలిందని, దీంతో తాత్కాలికంగా తాను జ్ఞాపకశక్తిని కోల్పోయానని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి అల్వరోడా ప్యాలెస్ లో ఈ ఘటన జరిగిందని, మరుసటి రోజు ఉదయం మాత్రమే తనకు గతం గుర్తుకు వచ్చిందని బాండ్ టెలివిజన్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. "ఆ సమయంలో నేను మెమొరీ లాస్ అయ్యాను. నాకేమీ తెలియలేదు. అంటే, ముందురోజు నేనేం చేశానో నాకు గుర్తు లేదు" అని 64 ఏళ్ల బోల్సొనారో అన్నారు.

కాగా, బాత్ రూమ్ లో కిందపడిన ఆయన్ను బ్రసీలియాలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఒకరోజు అనంతరం మంగళవారం నాడు, విశ్రాంతి తీసుకోవాలని కోరుతూ డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. గత సెప్టెంబర్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్న వేళ, బోర్సొనారోపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఆయనపై కత్తితో దాడి జరుగగా, నాలుగు సర్జరీలు జరిగాయి. ఇటీవలే ఆయనకు స్కిన్ క్యాన్సర్ కూడా సోకింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, హత్యాయత్నం తరువాత మరింత జాగ్రత్తగా ఉంటున్నానని తాజా ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.